కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా పట్టి పీడించిందో అందరికీ తెలిసిందే. ఈ వైరస్ సృష్టించిన లాక్డౌన్లు, ఐసోలేషన్లు అన్నీ ముగిసిపోయి ఇప్పుడిప్పుడే ప్రపంచం మునుపటి సాధారణ స్థితికి చేరుకున్న దశలో… చైనాలో మరో కొత్త వైరస్‌ను గుర్తించారు. వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే హానికర వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడు వ్యాధులకు కూడా దారితీస్తోన్న ఈ వైరస్‌ను 2019 జూన్‌లో మొదటిసారి చైనాలోని జిన్‌జౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. వైరస్‌కు గురైనట్టు గుర్తించిన తొలి వ్యక్తి వెట్‌ల్యాండ్ అనే పార్క్‌కు వెళ్లాడు. అక్కడే అతడికి వైరస్ సోకింది. అందుకే దీనికి ‘వెట్‌ల్యాండ్ వైరస్’ అని పేరు పెట్టారని ‘ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ పేర్కొంది.
2019లో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో ఉన్న వెస్ట్‌బ్యాంక్ అనే పార్క్‌లో ఓ పేను కాటుకు గురైన వ్యక్తి నిరంతర జ్వరం, పలు శరీర అవయవాలు పనిచేయని లక్షణాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని జర్నల్ పేర్కొంది. అయితే వైరస్ సీక్వెన్స్‌ను పరిశీలించి ‘వెట్‌ల్యాండ్’ వైరస్ అని పేరు పెట్టారని పరిశోధకులు పేర్కొన్నారు. గతంలో ఈ వైరస్‌ను గుర్తు తెలియని ఆర్థోనైరో వైరస్‌గా పేర్కొనే వారని చెప్పారు.
17 మంది రోగులలో వెట్‌ల్యాండ్ వైరస్ గుర్తింపు..
వెట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలు మొత్తం 17 మందిలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదటి వ్యక్తికి వైరస్ సోకడానికి కారణమైన అదే పార్కును సందర్శించిన వ్యక్తుల్లో ఈ వైరస్‌ను వైద్యులు నిర్ధారించారు. అదే లక్షణాలతో చేరిన వారిలో ఈ వైరస్‌ను గుర్తించారు. దీంతో పెద్ద సంఖ్యలో నమూనాలను స్వీకరించడం మొదలుపెట్టారు. చైనాలోని ఇన్నర్ మంగోలియా, హీలాంగ్జియాంగ్, జిలిన్, లియోనింగ్లలో ఈ రోగులను గుర్తించారు. వీరంతా తీవ్రమైన ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు గుర్తించినట్టు అధ్యయనం పేర్కొంది.
వైరస్ లక్షణాలు ఇవే..
వెట్‌ల్యాండ్ వైరస్‌కు గురైన అందరిలోనూ ఒకే విధమైన లక్షణాలు కనిపించడం లేదు. అయితే అందరిలోనూ జ్వరం, తలనొప్పి, మైకం, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. కొందరికి చర్మంపై చిన్నగా, గుండ్రని ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు ఉంటున్నాయి. లెంఫాడెనోపతీ అనే లక్షణం కూడా కొందరిలో కనిపిస్తోంది. శరీరంలోని ఒక ప్రాంతంలో కణుపులు వాస్తున్నాయి. మెడ లేదా చంక వంటి భాగాల్లో వాపు కనిపిస్తోంది. అంతేకాదు వెట్‌ల్యాండ్ వైరస్ మెదడుపై కూడా ప్రభావం చూపుతోంది.