భూ భారతి చట్టంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను తిరోగమన దిశగా నడపాలని కంకణం కట్టుకున్నది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేసీఆర్‌పై అక్కసుతో రద్దు చేసి, ప్రజలపై మళ్లీ గుదిబండను మోపేందుకు సిద్ధమైంది. గ్రామాల్లో మళ్లీ వీఆర్వోల వ్యవస్థను తీసుకురానున్నది. వాస్తవానికి గతంలో వీఆర్వో వ్యవస్థపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో భూ రికార్డులను డిజిటలైజ్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ అధికారులతో పనిలేదని భావించింది. అందుకే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. దీనిపై ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వీఆర్వో వ్యవస్థను తెరపైకి తెచ్చింది. గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించి, వారికి మళ్లీ రికార్డుల నిర్వహణ అధికారాలు కట్టబెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దీంతో గ్రామాల్లో మళ్లీ రాబందుల్లా వీఆర్వోలు రాజ్యమేలే కాలం దాపురించబోతున్నదని ప్రజల్లో అనుమానం మొదలైంది.
కొత్త బిల్లులో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు విచక్షణాధికారాలను కట్టబెట్టారు. ఆర్వోఆర్ చట్టం-2020 ముందు వరకు అధికారులకు ఈ విచక్షణాధికారాలు ఉండేవి. ఈ వెసులుబాటును అడ్డుపెట్టుకొని వారు ప్రజలను పీడిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం సమగ్రంగా వివరాలు సేకరించింది. ఆ ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్టు తేలడంతో రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలను తొలగించి, కలెక్టర్‌కు మాత్రమే అధికారాలు కల్పించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు విచక్షణాధికారాలను కట్టబెట్టడంతో కొత్త చట్టం ‘పాత సీసాలో కొత్త సారా’ అన్నట్టుగా ఉన్నదని నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు. 1971 నాటి ఆర్వోఆర్ చట్టాన్నే మళ్లీ అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అప్పట్లో కంప్యూటర్ రికార్డులు లేవని, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారే తప్ప ఈ రెండింటి మధ్య పెద్దగా తేడాలు లేవని పేర్కొంటున్నారు.