ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసినా తమ పేర్లు లిస్ట్‌లో ఎందుకు లేవు? అని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంకు పరిధిలో మొత్తం 900 మంది రుణాలు తీసుకోగా 204 మందికే మాఫీ జరిగిందనన్నారు. రుణమాఫీపై వ్యవసాయశాఖ అధికారులకు ప్రభుత్వం ఓ యాప్ అందుబాటులోకి తెచ్చినా అందులో కూడా తమ వివరాలు లేవని వాపోయారు. బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి బ్యాంకులో తీసుకున్న రూ. లక్షా యాభై వేల రుణాల జాబితాను ప్రభుత్వానికి పంపి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
లక్ష రుణం మాఫీ కాలె
నేను సోన్‌లోని ఇండియన్ బ్యాంకులో పదేండ్ల నుంచి వ్యవసాయ రుణం తీసుకుంటున్నా. నిరుడు లక్ష రుణం తీసుకున్నా. ప్రభుత్వం మాఫీ చేస్తదని ఎంతో సంబురపడ్డా. కానీ లిస్ట్‌లో నా పేరు లేదు. అధికారులను అడిగిన సరైన సమాధానం చెప్తలేరు. నా రుణం మాఫీ చేసి న్యాయం చేయాలి.
-దాసరి రాజేందర్, మం:సోన్, జిల్లా: నిర్మల్
రుణ మాఫీ చేయాలి..
నేను సోన్‌లోని ఇండియన్ బ్యాంకులో గతేడాది రూ.లక్ష రుణం తీసుకున్న. ప్ర భుత్వం ఒకటి, రెండో విడతలుగా రుణాలు ఇప్పటివరకు రూ.లక్షన్నర వరకు మాఫీ చేసింది. కానీ నాకు మాఫీ కాలేదు. ఎందుకు కాలేదో అర్థమైతలేదు. అధికారులు నా రుణం మాఫీ అయ్యేలా చూడాలి.