టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ గా దూసుకుపోయిన కాజల్ .. తమన్నా, బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టిగానే ట్రై చేశారు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయారు. ఇక ఆ తరువాత వరుసలో వచ్చిన రష్మిక .. కీర్తి సురేశ్ .. సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ పైనే దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది.
రష్మిక తెలుగు .. కన్నడ భాషల్లో స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూనే, బాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి, ‘యానిమల్’ సినిమా హిట్ తో అక్కడవారి దృష్టిని ఆకర్షించింది. దాంతో మరో రెండు హిందీ సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ కొడితే, అక్కడ రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తమిళ .. తెలుగు భాషల్లో బిజీగా ఉన్న కీర్తి సురేశ్ కూడా బాలీవుడ్ ఛాన్సులపై గట్టిగానే దృష్టిపెట్టింది. అక్కడ వరుణ్ ధావన్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. ఇంకా హిందీలో ఒకటి రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ ప్రాజెక్టులతో బిజీగా ఉండే సాయిపల్లవి కూడా హిందీలో ప్రాజెక్టులను ఒప్పేసుకుంటోంది. ‘రామాయణ’ తరువాత ఆమె అక్కడ బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ముగ్గురు భామలలో ఎవరు బాలీవుడ్ లో నిలదొక్కుకుంటారనేది.