తిరుమలలో పోలీసులు దళారుల భరతం పడుతున్నారు. అక్రమంగా గదులను తీసుకుని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారన్న సమాచారంతో నిందితులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు దళారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూం బుకింగ్ సిస్టమ్ ద్వారా.. మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ వ్యక్తులు తరచూ గదులు తీసుకోవడాన్ని గుర్తించారు.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితులు గత రెండు నెలలుగా తరచూ గదులు బుక్ చేస్తున్నట్టు తేలింది. ఈ బుకింగ్ సిస్టమ్ ను ఉపయోగించి నిందితులు దాదాపు 45 గదులను బుకింగ్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది.
భక్తుల ఆధార్ కార్డులతో టీటీడీ ని మోసం చేస్తూ గదులు పొందుతున్నట్లు గుర్తించామని తిరుమల 2 టౌన్ సీఐ సత్యనారాయణ చెప్పారు. నిందితులను కృష్ణా జిల్లాకు చెందిన నాగ బ్రహ్మచారి, వరంగల్ కు చెందిన వెంకటేశ్వరరావు గా గుర్తించినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విలాసాలకు అలవాటుపడి తిరుమలలో భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించామని.. దళారుల వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
నాగ బ్రహ్మచారి, వెంకటేశ్వరరావులు నకిలీ లేదా అరువుగా తీసుకున్న ఆధార్ కార్డులను ఉపయోగించి గదులను పొందారని.. పూజా అవసరాలు, ఆపై వాటిని పెంచిన ధరలకు తిరిగి విక్రయిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నారాయణ తెలిపారు. ముందు అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని.. ఆతర్వాత అసలు విషయాలు వెల్లడైనట్లు తెలిపారు.
వికెండ్స్, తీర్థయాత్రల సీజన్లలో తరచుగా గదుల కొరత ఉంటుంది.. ఈక్రమంలో ఇలాంటి స్కామ్‌లకు పాల్పడుతుంటారు.. ఇలాంటి దళారుల పట్ల యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా అనుమానాస్పద బుకింగ్ కార్యకలాపాలు, మోసాలను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని టీటీడీ కోరింది.