తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా సమాయత్తమవుతోంది.. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పంటరుణాల మాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది.. పంట రుణాల మాఫీకి శుక్రవారం కేబినెట్ ఆమోదముద్రవేసింది.. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలకు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది.. రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.7 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సమాచారం.. రుణమాఫీ విధివిధినాల ఖరారు, రైతు భరోసాపై చర్చ, రైతు కార్పొరేషన్ ఏర్పాటు, బడ్జెట్ సమావేశాలతోపాటు రాష్ట్ర కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపైనా కేబినెట్లో చర్చించారు.
కాగా.. శుక్రవారం.. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై చర్చించారు.. నిధుల సేకరణ ఎలా చేయాలనే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. విడతల వారీగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.. మరోవైపు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. దీనికి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సచివాలయంలో కేబినెట్ భేటీ కొనసాగుతోంది..భేటీ అనంతరం రుణ మాఫీ, రైతు భరోసా తదితర అంశాలపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది..