తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భావోద్వేగ ట్వీట్ చేశారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని తేల్చిచెప్పారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసమే రైతు రుణమాఫీ పథకమని అభవర్ణించారు.
ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైన ఘనత అని అన్నారు. నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశ రైతాంగానికి, నేడు ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ అందించే భరోసా అని చెప్పుకొచ్చారు. రుణమాఫీ అమలులో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా, మలి అడుగు విధివిధానాల ఖరారు అని సీఎం తెలిపారు. ప్రజాప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇది రైతన్నకు.. మీ రేవంతన్న మాట’ అంటూ ముఖ్యమంత్రి మంగళవారం ట్వీట్ చేశారు.