తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌పై మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్‌లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.
ఇక రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.