బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీని మరోసారి ఇరకాటంలో పెట్టారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణలో మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ జరిగిన ప్రచారాన్ని తెర మీదకు వచ్చేలా చేసినట్లు అయింది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం బీజేపీ, బీఆర్ఎస్ చీకటి బంధాన్ని నిదర్శనం అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. అందుకే కేటీఆర్ అడిగిన వెంటనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఈ ప్రచారం భారీ డ్యామేజీని తెచ్చిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే డ్యామేజీ కంట్రోల్ పనులను మొదలు పెట్టింది. కమలం నేతల తంటాలు పడుతున్నారు. కేంద్ర మంత్రి ఆఫీస్ లో కేటీఆర్ ఫోటోలు దిగి షో చేశారని ట్వీట్ చేశారు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్.. ఢిల్లీలో కేటీఆర్ ఎవరిని కలిసారో అక్కడి కాంగ్రెస్ నేతలు వెరిఫై చేసుకోవాలంటూ కొండ హితవు పలికారు.
తెలంగాణలో అరెస్ట్ చేస్తారేమో అనే భయంతోనే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు వెళ్లరేమో ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఆరా తీయాలంటూ కొండ చురకలు అంటించారు. మరోవైపు పాత ముచ్చట పట్టుకొని కొత్త భూకంపం ఎందుకు వస్తదనుకుంటున్నవు.. మంత్రిని కలిసినవు ? ఎందుకు కలిశావు ? కలిసిన ఫోటో ఏది? భూకంపం ఎందుకొస్తది? అంటూ కేటీఆర్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కాగా కేటీఆర్ ఢిల్లీ టూర్ ను తిప్పి కోట్టకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.