అసెంబ్లీ సమావేశాలు మళ్లీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 9న అసెంబ్లీ సమావేశాల్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరోజు కొన్ని బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టి, సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపి, సభను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 9వ తేదీనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సచివాలయ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మళ్లీ వారం తర్వాత శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభమవుతాయని శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు తెలిపారు. ప్రభుత్వం ఈనెల 9న ఐదు ఆర్డినెన్సుల్ని సభలో ప్రవేశపెట్టింది. వాటిలో 2024 తెలంగాణ జీతాలు, ఫించను చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్, పురపాలక సంఘాల (సవరణ) ఆర్డినెన్స్, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్స్, వస్తుసేవల పన్ను ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ (సవరణ) ఆర్డినెన్సులు ఉన్నాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2022-23 ఆర్థిక సంవత్సర తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ 9వ వార్షిక నివేదిక ప్రతిని కూడా సభలో ప్రవేశపెట్టారు. అలాగే సోమవారం జరిగే ప్రశ్నోత్తరాల్లో గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్ల నిర్మాణం, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య కార్మికుల క్రమబద్ధీకరణ, గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపు, ముదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం, నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, పర్యాటకానికి ప్రోత్సాహం, ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ విద్యార్థుల డిటెన్షన్, బెల్ట్‌షాపుల మూసివేత, ఐవీఎఫ్ కేంద్రాలు, జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్తారు. అలాగే ఆర్‌ఓఆర్ సవరణ చట్టంపై కూడా ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనున్నది.
0