అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ తెల్లవారుజామున తాడిపత్రికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని అనంతపురం జిల్లా నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతామని జేసీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో, ష్యూరిటీలు సమర్పించేందుకు ఆయన అనంతపురం నుంచి తాడిపత్రికి వచ్చారు. నేరుగా తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పెద్దారెడ్డి… ష్యూరిటీలు సమర్పించి, సంతకం చేసి వెళ్లిపోయారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత… పెద్దారెడ్డిని ఎక్కువ సేపు తాడిపత్రిలో ఉంచకుండా పోలీసులు అనంతపురంకు తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకుండా తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం గమనార్హం.