రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పెద్ద ఎత్తున నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ఇటు విద్యార్థులు భయపడిపోతుంటే..అక్కడ చదివించడానికి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని రెండు గురుకుల పాఠశాలల్లో 5 రోజులలోనే 2 ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో విద్యార్థుల కుటుంబాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.
కీసరలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపర్చిన సంఘటన మరవక ముందే నాగారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 33 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థత గురై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు డిశ్చార్జి అయ్యారు.
అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఈ ఘటనలకు కారణమని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా నాగారం పాఠశాలను శుక్రవారం సందర్శించి విచారించారు. పిల్లలు తినే భోజనం ఎలా అస్వస్థత పాలు చేసిందనే విషయంపై కారణాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విచారణ ప్రారంభించారు.