manatelanganatv.com

మూసీపై తగ్గేదేలే..

మూసీ ప్రక్షాళనపై వెనక్కు తగ్గేదే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. దానిపై ముందుకే వెళతామని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవ పథకానికి సంబంధించిన పనులకు నవంబరు ఒకటిన శంఖుస్థాపన చేస్తామని వెల్లడించారు. అదే నెలలో టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రతిపక్షాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని వివరించారు. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సైతం సిద్ధమని తెలిపారు. వారు తమ తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోగల తన నివాసంలో సీఎం రేవంత్‌… పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మూసీ ప్రక్షాళన, దానిపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీఆర్‌ఎస్‌ హయాంలోని అప్పులు, అప్పట్లో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం, విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ తదితరాంశాలపై ఆయన ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారిపై ముఖ్యమంత్రి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మూసీ పునరుజ్జీవానికి సంబంధించి హైదరాబాద్‌ బాపూఘాట్‌ నుంచి పనులను ప్రారంభిస్తామని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. అక్కడి నుంచి 21 కిలోమీటర్లు వెనక్కి అభివృద్ధి చేస్తామని తెలిపారు. మల్లన్న సాగర్‌ నుంచి మూసీకి నీటిని తరలిస్తామనీ, ఇందుకోసం టెండర్లను ఆహ్వానిస్తామని అన్నారు. మూసీ అభివృద్ధిపై అధ్యయనం కోసం హైదరాబాద్‌ నగర ప్రజా ప్రతినిధులను, కార్పొరేటర్లను దక్షిణ కొరియలోని సియోల్‌కు పంపుతామని చెప్పారు. మూసీ ప్రక్షాళన వల్ల రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీని ప్రక్షాళన చేస్తే మరింత అందమైన, అద్భుతమైన నగరంగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై కావాలనే చర్చకు తెరలేపామని అన్నారు. ఈ క్రమంలో మూసీని బాగుచేసే నాయకుడు దొరికాడంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలకు తనను కలిసేందుకు ఇబ్బందిగా ఉంటే మంత్రులు, అధికారులను కలిసి అభిప్రాయాలను చెప్పొచ్చని సూచించారు. మూసీ కోసం భూములిచ్చేవారిని వందశాతం సంతృప్తి పరిచేలా ప్యాకేజీలు ఇస్తామని హామీనిచ్చారు. అంతేతప్ప ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమని భరోసానిచ్చారు. ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ పదేండ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ ఎందుకు వ్యతిరేకిస్తోందో అర్థం కావటం లేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన లాంటి మంచి పనులకు మీడియా సహకరించాలని కోరారు. ఆ నదీ పరివాహక ప్రాంతంలో వాడపల్లి నుంచి వికారాబాద్‌ దాకా అవసరమైతే తాను పాదయాత్ర చేపడతానని సీఎం తెలిపారు.
బీఆర్‌ఎస్‌ హయాంలోని ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లు తదితరాంశాలపై విచారణ కొనసాగుతోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అయితే విచారణ సమయంలో కక్ష సాధింపు చర్యలుండబోవని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ అంశంలో రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. పదేండ్ల కాలంలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని తమ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున్నే జీతాలేస్తున్నామని గుర్తు చేశారు.
జన్వాడ ఫామ్‌హౌస్‌పై బీఆర్‌ఎస్‌ కట్టుకథలు చెబుతోందని సీఎం ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారు, కానీ జన్వాడ ఫామ్‌హౌస్‌లో సారాయి బుడ్లు బయటపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావత్‌ అంటే లైసెన్సు లేని విదేశీ మద్యం బాటిళ్లా? క్యాసినో కాయిన్లా? అని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయకపోతే కేటీఆర్‌ బావ మరిది రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? ముందస్తు బెయిల్‌కు ఎందుకు అప్లై చేశారని నిలదీశారు. గతంలో పోగేసుకున్న అక్రమ సంపాదనతో బీఆర్‌ఎస్‌ తన సోషల్‌ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తమకు మంచే జరిగిందనీ, బీఆర్‌ఎస్‌ వల్ల హైడ్రాపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగిందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్తబ్దత నెలకొందనీ, అంతే తప్ప హైడ్రా వల్ల తెలంగాణలో ఆ రంగం పడిపోలేదని విశదీకరించారు.


గేమ్‌ప్లాన్‌పై నాకు స్పష్టత ఉంది…
తాను ఫుట్‌బాల్‌ ప్లేయర్‌నంటూ సీఎం ఈ సందర్భంగా చెప్పుకొన్నారు. అందువల్ల ఆటను ఎలా మొదలెట్టాలో, ఎలా ముగించాలో తెలుసునని వ్యాఖ్యానించారు. సినిమాల్లో రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ… ఇద్దరూ అగ్రశ్రేణి దర్శకులు, అయినా ఎవరి స్టైల్‌ వాళ్లదంటూ చెప్పుకొచ్చారు. అదే మాదిరిగా రాజకీయాల్లో కేటీఆర్‌ స్టైల్‌ కేటీఆర్‌ది, తన స్టైల్‌ తనదని అన్నారు. రాజకీయాల్లో కేసీఆర్‌ పనైపోయిందని ఎద్దేవా చేశారు. పాలిటిక్స్‌లో ఆయన ఉనికే లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం ఆయన తనయుణ్నే (కేటీఆర్‌) వాడుకున్నానని అన్నారు. భవిష్యత్‌లో కేటీఆర్‌కు కూడా రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేస్తామనీ, అందుకోసం మాజీ మంత్రి హరీశ్‌ను వాడుకుంటామని తెలిపారు. ఆయన్ను (హరీశ్‌ను) ఎలా వాడుకోవాలో తమకు బాగా తెలుసునంటూ సెటైర్లు విసిరారు. రాజకీయంగా మిగతా వారితో పోలిస్తే తాను చాలా చిన్న వయస్కుడినని, ఇంకా తనకు ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కావాలన్న తన కోరిక నెరవేరిందని సీఎం సంతోషం వెలిబుచ్చారు. అంతకు మించిన పెద్ద కోరికలేవీ తనకు లేవన్నారు. ఏ విషయంలోనైనా అణచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోవాలని భావించటం లేదని తెలిపారు. అందరితోనూ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తామని సీఎం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278