manatelanganatv.com

రైతు భరోసా అందేనా..?

”అధికారంలోకి రాగానే రైతు బంధు కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తాం. రైతులకే కాదు.. కౌలుదారులకు సైతం ఇస్తాం. గ్రామీణ వ్యవసాయ కూలీలకు సైతం ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తాం” ఇదీ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది.. ఇప్పటి వరకు ‘రైతు భరోసా’ రైతులకు అందలేదు. పట్టాదారులకే కాదు కౌలుదారులకూ రైతు భరోసా అందలేదు. ఖరీఫ్‌ సీజన్‌ పంటలొచ్చి దిగుబడులు మార్కెట్లల్లో మగ్గుతున్నాయి. రబీ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతల చేతుల్లో చిల్లిగవ్వలేక రైతు భరోసా కోసం గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక యాసంగీ, ఖరీఫ్‌ రెండు సీజన్లు ముగిశాయి. ముచ్చటగా తిరిగి మూడో సీజన్‌గా యాసంగీ (రబీ) సమయమొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గత రబీ సీజన్‌లో రైతు బంధు డబ్బుల్ని పాత పద్దతిలోనే ఇచ్చారు. ప్రస్తుతం రైతులు పండించిన పంట దిగుబడులు మార్కెట్‌లో కొనుగోళ్లు లేక మగ్గుతున్నాయి. పంట అమ్ముకోలేక, అమ్మినా పైకం చేతికందక అయోమయ పరిస్థితిల్లో రైతులు ఉన్నారు. ఇదిలా ఉండగానే మళ్లీ యాసంగి వరి నార్లు పోయడం, దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువుల్ని సమకూర్చుకునే పనిలో పడ్డారు. సర్కార్‌ ఇస్తామన్న భరోసా డబ్బులొస్తే పెట్టుబడులకు తిప్పలు తప్పుతాయని భావిస్తున్నారు.
10 ఎకరాల్లోపు 60.93 లక్షల మంది పట్టాదారులు
రాష్ట్రంలో రైతు భరోసా అమలు కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. పలుమార్లు సమావేశమైన కమిటీ రైతు భరోసా అమలు కోసం సమగ్ర సమాచారం కోసం వ్యవసాయ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకుంది. వ్వవసాయ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 157.43 లక్షల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. అందులో ప్రతి ఏటా 152.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 74.58 లక్షల మంది పట్టాదారులుండగా వీరిలో 90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. భూమి కలిగిన వారి లెక్కల్ని పరిశీలిస్తే.. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 56,10,667 (90.3 శాతం) ఉన్నారు. 5-10 ఎకరాల్లోపు భూములన్న రైతులు 4,82,766 మంది (7.80 శాతం) ఉన్నారు. 10 నుంచి 54 ఎకరాల్లోపు ఉన్న రైతులు 1,16,722 (1.80 శాతం) ఉన్నారు.
11 విడతల్లో గత ప్రభుత్వం..
గత ప్రభుత్వంలో 11 విడతల్లో రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని అందించినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018-19లో రైతు బంధు పథకం అమల్లోకి వచ్చాక 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు గత ప్రభుత్వం రైతు బంధు అమలు చేసింది. 2018-19లో 50 లక్షల మంది రైతులకు రూ.10486.36 కోట్లు, 2019-20లో 52 లక్షల మందికి రూ.10532.02 కోట్లు, 2020-21లో 59 లక్షల మందికి రూ.14656.01 కోట్లు, 2021-22లో 63 లక్షల మంది రైతులకు రూ.14772.99 కోట్లు, 2022-23లో 65 లక్షల మందికి రూ.14743.02 కోట్లు, 2023-24లో 69 లక్షల మందికి రూ.15262.92 కోట్ల మేరకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 11 విడతత్లో కలిపి 65,99,091 మంది రైతుల ఖాతాల్లో రూ.8771 కోట్ల నిధుల్ని జమ చేశారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మందికి రూ.3619.54 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 29,33,494 మందికి రూ.3124.82 కోట్లు, మెదక్‌ జిల్లాలో 24,69,637 మంది రైతులకు రూ.2027.37 కోట్లు రైతు బంధు కింద జమయ్యాయి.
సాగు భూములకైనా ఇవ్వండి


పంటలు పండించే భూములకైనా వెంటనే రైతు భరోసా సాయం ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. గత ప్రభుత్వంలో పడావు (సాగవ్వని) భూములకు కూడా రైతు బంధు ఇచ్చినట్టు తేలింది. 11 విడతల్లో కలిపి రూ.25,672.18 కోట్లు.. పంటలు సాగు చేయని పడావు భూములకు ఇచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. అదే విధంగా పదెకరాలకు పై బడి భూములున్న రైతులు 1,16,722 మంది (1.80 శాతం) ఉన్నట్టు తేల్చారు. పడావు భూములు, అధిక భూములన్న వాళ్లను మినహాయించి పదెకరాల్లోపు ఉన్న 60,93,433 (97.83 శాతం) మంది రైతులకు వెంటనే రైతు భరోసా కింద రూ.15 వేల ఆర్థిక సహాయం ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా అమలు చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.2260 కోట్ల అదనపు భారం పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. పదెకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తే ప్రభుత్వానికి రూ.1385 కోట్లు ఆదా అవుతాయని కూడా అదే అధికారులు పేర్కొన్నారు.
యాసంగి పెట్టుబడులకు భరోసా అందించాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందిస్తదన్న గంపెడాశతో అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన వివిధ పంటల దిగుబడులు చేతికొచ్చాయి. ముఖ్యంగా రెండు ప్రధాన పంటలుగా ఉన్న వరి, పత్తి దిగుబడులొచ్చాయి. వీటిని అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకెళ్లారు. సీసీఐ నిర్లక్షం వల్ల పత్తి కొనుగోళ్లు సాగట్లేదు. జిన్నింగ్‌ మిల్లుల సమ్మె, దళారుల దోపిడి, సీసీఐ అనాసక్తితో రైతులు పంటను అమ్ముకోలేకపోతున్నారు. మరో పక్క వడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ కూడా బ్యాంకు గ్యారంటీ పేరిట ధాన్యం కేటాయింపుల్లో కొనసాగుతున్న తాత్సారం వల్ల ధాన్యం అమ్ముడుపోవట్లేదు. మిల్లర్లకు అమ్మి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల రైతుల చేతుల్లో చిల్లిగవ్వలేకుండా పోయింది. మరో పక్క యాసంగీ పంటల సాగు సమయం సమీపిస్తుంది. యాసంగీ నీటి ఎద్దడి, కరెంట్‌ కోతలు, అకాల వర్షాల వంటి ఇబ్బందుల రీత్యా వరి సాగు చేసే రైతులు ముందస్తు సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నార్లు పోసేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. విత్తనాలు, ఎరువుల్ని తెచ్చుకోవాలి. ఖరీఫ్‌లో దుక్కులు దున్నిక ట్రాక్టర్ల కిరాయి డబ్బులివ్వకపోవడంతో నార్ల కోసం దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ల యజమానులు సతాయిస్తున్నారు. విత్తనాలు, ఎరువులిచ్చే ఫర్టిలైజర్‌ వ్యాపారులు దుకాణం ముందుకే రానిస్తలేరని పలువురు రైతులు వాపోతున్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278