గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట కార్యక్రమం చేపట్టామని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. బీఆర్‌ఎస్ గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్‌కు వణుకు మొదలైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో దాదాపు ఏడాదిగా విద్యాశాఖకు మంత్రి లేరని, సంక్షేమ శాఖకు మంత్రి లేదరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకులాలు ప్రమాదపుటంచులో ఉన్నాయన్నారు. నాణ్యమైన భోజనం కోసం విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖను తెలంగాణ ప్రజలు గతంలోనే తిరస్కరించారని చెప్పారు. మహిళలపై చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందన్నారు. ఏడేండ్ల సర్వీస్ వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని సురేఖ చెప్పారని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. తనపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వాలన్నారు.
0