జాతీయ రాజకీయాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఎక్స్ వేదికగా వచ్చిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, 1 మజ్లిస్ ఎంపీని గెలిపించారని… తద్వారా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలలో, అసలు తెలంగాణ పాత్ర లేకుండా తెలంగాణ ప్రజలే చేసుకున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేవలం గుంపులో గోవింద లెక్క అయ్యారన్నారు. పక్క రాష్ట్రం చంద్రబాబుకి 16, బీహార్ నితీష్ కుమార్‌కి కేవలం 12 సీట్లు ఉన్నా ఈరోజు చక్రం తిప్పుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఓడించి, తెలంగాణ వాడికి వాయిస్ లేకుండా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌కి 10 ఎంపీ సీట్లు ఉంటే, మనం కూడా చక్రం తిప్పేవారమని… తద్వారా మన రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకునే వాళ్లమన్నారు. ముందు నుండీ… మన బుర్రలేనితనం వల్లనే తెలంగాణ ఎప్పుడూ మోసపోతోందని పేర్కొన్నారు. కేసీఆర్ తనకు 10 మంది ఎంపీలను ఇవ్వమని స్పష్టంగా అడిగితే వెటకారం చేశారన్నారు.