manatelanganatv.com

 సికింద్రాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతి అరెస్టు.. స్కెచ్ మామూలుగా లేదుగా!

అవినీతి తిమింగలాన్ని అధికారులు అరెస్ట్ చేశారు. బతికున్న వ్యక్తిని మృతి చెందినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, కాసులకు కక్కుర్తిపడి ఏకంగా రూ.కోటి విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు సదరు అవినీతి అధికారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన సికింద్రాబాద్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సికింద్రాబాద్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌గా ఉన్న జ్యోతి అనే అధికారి గతంలో కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసింది. అయితే సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో ఓ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన లెండ్యాల సురేశ్‌ అనే వ్యక్తికి.. జీడిమెట్ల ఠాణా పరిధిలోని సుభాష్‌నగర్‌-వెంకటాద్రినగర్‌ సర్వే నంబరు 33/8, 33/11లలో రెండు వందల గజాల ఖాళీ స్థలం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అంచనా. ఈ స్థలాన్ని స్థానిక నేత పద్మజారెడ్డి అలియాస్‌ కుత్బుల్లాపూర్‌ పద్మక్క కబ్జా చేసింది. అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి.. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. సురేశ్‌ 1992లో మృతి చెందాడని, మరో యువకుడిని తీసుకువచ్చి, అతడే వారసుడంటూ నకిలీ ధ్రువపత్రాలను జ్యోతి సృష్టించింది. ఈ మేరకు నకిలీ మరణ ధ్రువీకరణపత్రం, నకిలీ పాన్‌కార్డు, ఆధార్‌కార్డులు సృష్టించారు. వాటి సాయంతో పద్మజారెడ్డి సోదరి నాగిరెడ్డి కోమలకుమారి పేరిట గతేడాది ఫిబ్రవరిలో స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు.

ఇటీవల ఆ స్థలం చుట్టూ గోడ నిర్మించడంతో అనుమానం వచ్చిన సురేశ్‌ ఆరా తీయడంతో అసలు మోసం బయటపడింది. దీంతో ఆగస్టు 16న జీడిమెట్ల పోలీసులకు సురేశ్‌ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్, ఎస్‌ఐ హరీశ్‌లు పద్మజారెడ్డి, ఆమెకు సహకరించిన మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దీంతో మంగళవారం పోలీసులు సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని అరెస్టు చేసి మేడ్చల్‌ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. విచారణ నిమిత్తం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278