మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి కాన్వెంట్ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం దత్త ఐలాండ్ కూడలికి వస్తారు. ముందుగా.. వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా ప్రాంగణం వరకు 800 మీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటల 45నిమిషాల నుంచి ఐదున్నర వరకు జరిగే రోడ్ షోకు మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హాజరుకానున్నారు. ఆ తర్వాత ప్రధాని కాన్వాయ్‌లోనే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అదే వేదిక నుంచి వర్చువల్‌గా 2లక్షల కోట్లకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఇక.. ప్రధాని మోదీ రోడ్ షోకి 8 నియోజకవర్గాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్కింగ్ స్థలానికి చేరుకుని అక్కడినుంచి రోడ్ షో పాయింట్‌కు రానున్నారు. రోడ్ షోలో పూలు, జెండాలతో ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు ప్రజలు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవైన భారీ వేదికపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, కేంద్రమంత్రులు ఆశీనులు కానున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఏడు వేలకు పైగా వాహనాల కోసం విశాఖలోని 26 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మోదీ టూర్ నేపథ్యంలో విశాఖ నగరం నిఘా నీడలో కొనసాగుతోంది. కేంద్ర బలగాలు, 5 వేలమంది పోలీసులు, 33మంది ఐపీఎస్‌లతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. బహిరంగసభ జరిగే AU మైదానం రెండు రోజుల ముందే ఎస్పీజీ దళాల ఆధీనంలోకి వెళ్లింది.