మోహన్ బాబు వారసురాలిగా సినీపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ఆ తరువాత తనకంటూ పత్ర్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా, టీవీ షో హోస్ట్‌గా, నిర్మాతగా విజయాన్ని అందుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచులక్ష్మి ట్రోలర్ల విషయంలో దూకుడుగా ఉంటుంది. వాళ్ల తీరును ఎండగట్టేందుకు అసలేమాత్రం సంకోచించదు. అయితే, తాజాగా ప్రజల సాయం అర్థిస్తూ మంచు లక్ష్మి పెట్టిన పోస్టు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
‘‘నిరాశలో సహాయం కోసం వెయిట్ చేస్తున్నా. నా వీసా కోసం నెల క్రితం అప్లై చేశాను. కానీ ఇప్పటికీ నాకు అది రాలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగుస్తున్నాయి. జులై 12న నా ఫ్లైట్ ఉంది. ఎంబసీ వెబ్‌సైట్ డౌన్ కావడంతో, వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా సహాయం చేయగలరా?’’ అంటూ మంచు లక్ష్మి తన సమస్యను నెట్టింట పంచుకుంది.
మంచు లక్ష్మి పోస్టుకు జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. తమకు తెలిసిన వారి ఫోన్ నెంబర్లు షేర్ చేశారు. సెలబ్రిటీ అయ్యుండీ సామాన్యుల్ని సహాయం అడగడంపై మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.