ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యత అప్పజెప్పింది. పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ప్రయాణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతో బీజేపీ జట్టుకట్టి.. మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిన సంగతే. తాజాగా బీజేపీ పవన్ కళ్యాణ్‌కు మరో బాధ్యత అప్పగించింది.
ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి ఫోకస్ మాత్రం మహారాష్ట్ర ఎన్నికలపై గట్టిగా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ.. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్‌ను బరిలోకి దించనున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్‍ను కోరింది. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు నవంబర్ 16,17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.