గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని, నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డీ ప్రసాద్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ స్పందించింది. ఆర్డీ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ను సీఐడీ ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని క్రీడాకారులు అంటున్నారు. ప్రభుత్వ చర్యలను మాత్రం వైసీపీ తప్పుబడుతోంది. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా ఫిర్యాదులు చేసి విచారణలను కోరుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
0