గ్రూప్-1 ఉద్యోగాలు తక్కువ ఉన్నాయని గతంలో చెప్పిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చాక కేవలం 60 పోస్టులనే పెంచిందని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. చదువుకున్న వారికే పోటీ పరీక్షల విలువ తెలుస్తుందన్నారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య నెల రోజుల వ్యవధి ఉండాలన్నారు.
ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… లక్షల రూపాయల జీతం తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి వద్ద నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డబ్బులు లేవని ఎద్దేవా చేశారు.
కుల, జన గణన ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటకు తీస్తే 24 గంటల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. పంచాయతీ, ఎంపీటీసీ పదవీ కాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదో చెప్పాలన్నారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.