manatelanganatv.com

లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

ఒకే దేశం-ఒకే ఎన్నిక (One Nation One Election Bill) లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్‌సభ (Lok Sabha) ముందుకు వెళ్లింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం మంగళవారం సభలో ప్రశేపెట్టింది. ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపులు జరిపేందుకు గానూ పార్లమెంటు ఉభయసభల ఉమ్మడి కమిటీకి ఈ బిల్లును సిఫారసు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను మేఘ్వాల్‌ కోరారు.

ఎంపీల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. ఏ పార్టీ తరఫున ఎంతమంది సభ్యులు ఉంటారో స్పీకర్‌ సాయంత్రానికి ప్రకటించనున్నారు. అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి కమిటీ చైర్మన్‌ ఉండనున్నారు. కమిటీలో ఉండేందుకు ఎంపీల పేర్లను ఇవాళే ప్రతిపాదించాలని రాజకీయ పార్టీలను స్పీకర్‌ కోరనున్నారు. ప్రాథమికంగా ఈ కమిటీ కాలపరిమితి 90 రోజులు విధించనున్నారు. తర్వాత ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది. కాగా, జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు 32 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా, 15 పార్టీలు వ్యతిరేకించినట్టు ఇప్పటికే రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది.

Leave a Comment