యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్-సీబీపీ) డాటా ప్రకారం గత అమెరికా ఆర్థిక సంవత్సరం(అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024) మధ్యకాలంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 29 లక్షల మందిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వీరిలో 90,415 మంది భారతీయులు ఉన్నారు. అంటే దాదాపు గంటకు 10 మంది భారతీయులు అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోతున్నారు. పట్టుబడ్డ భారతీయుల్లో గుజరాత్‌కు చెందిన వారే దాదాపు 50 శాతం మంది ఉన్నట్టు తెలుస్తున్నది.
మెక్సికో, కెనడా నుంచి..
అక్రమంగా అమెరికాలోకి వెళ్లేవారు మెక్సికో, కెనడా నుంచి ప్రవేశిస్తున్నారు. మెక్సికో నుంచి వెళ్లే దారిని డాంకీ రూట్ అంటారు. అయితే, మెక్సికోకు వెళ్లేముందు అక్రమ వలసదారులను కొన్నిరోజులు ఏజెంట్లు దుబాయ్ లేదా టర్కీలో ఉంచుతున్నారని, ఈ సమయంలోనే అమెరికా నిఘా వేసి వీరిని అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇప్పుడు ఎక్కువగా కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్టు చెప్తున్నారు. చాలామంది కెనడాకు పర్యటక వీసాపై వెళ్లి అక్కడి నుంచి అమెరికా సరిహద్దు దాటుతున్నారని, ఇలాంటి వారు దొరికితే అమెరికా భద్రతా సంస్థలు మళ్లీ కెనడాలో వదులుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇలా పట్టుబడే వారి కంటే గుట్టుగా సరిహద్దు దాటే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తున్నది.