manatelanganatv.com

నందిగం సురేష్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు సుప్రీం వాయిదా వేసింది. కాగా ఈ కేసులో 78వ నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. 

ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోలేమని.. ఆ తర్వాతే దీనిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సురేష్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థిత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

ఈ కేసులో చార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయలేదని తెలిపింది. అంతేకాకుండా సురేష్ అరెస్ట్ అయి 90 రోజులు కూడా కానందున బెయిల్‌కు సంబంధించి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. అలాగే గతంలో నమోదైన కేసు వివరాలను బెయిల్ పిటిషన్‌లో నమోదు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పబట్టింది. 2020లో ఈ కేసు నమోదు అయిందని.. కానీ అప్పటి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించింది. అప్పుడు విచారణ జరిగి ఉంటే నిర్దోషిత్వం బయటపడేది కదా అని సుప్రీం పేర్కొంది. 

అసలు ఏం జరిగింది.. ఏంటి ఈ కేసు?

2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ వైసీపీపై విమర్శలు చేసింది. తన పెన్షన్ ఆపేశారని.. ఇళ్లు ఇప్పిస్తామని ఇవ్వలేదని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించింది. దీంతో అప్పటి ఎంపీ నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో మరియమ్మ మృతి చెందింది. ఇక అప్పట్లో ఈ కేసును పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరియమ్మ కేసు ఫైల్ తెరపైకి వచ్చింది.

మరియమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నందిగం సురేష్ సహా ఆయన అనుచరులపై కేసు నమోదు అయింది. ఈ కేసులో తనకు బెయిల్ కావాలని హైకోర్టును ఆశ్రయించినా సురేష్‌కు ఊరట దక్కలేదు. హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సురేష్ సుప్రీంకి వెళ్లారు. అక్కడ కూడా ఊరట దక్కలేదు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278