అన్ని హిందూ దేవాలయాలలో వివిధ రకాల పండ్లు, పువ్వులు, పలు రకాల ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదాహరణకు, అయ్యప్పకు నెయ్యి, కృష్ణుడికి వెన్న, గణేశుడికి లడ్డూలు సమర్పించడం మనకు తెలుసు. అలాగే, కొన్ని దేవాలయాలలో పాయసం, పొంగల్, పులిహోర, దద్దోజనం వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ, ఇక్కడ ఒక గుడిలో దేవుడికి మంచ్ చాక్లెట్ నైవేద్యంగా సమర్పిస్తారు. కేరళలోని ఓ అరుదైన ఆలయంలో ఈ వింత ఆచారం జరుగుతోంది. దీని వెనుక ఉన్న కథ వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు.
కేరళలోని మంచ్ మురుగన్ ఆలయంలో మంచ్ చాక్లెట్‌ను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతే కాదు, ఈ ఆలయంలో ప్రత్యేక సందర్భాలలో మంచ్ చాక్లెట్‌ను భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. గత ఆరేళ్లుగా ఈ పద్ధతి ప్రారంభమైందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
వాస్తవానికి ఒకసారి ఒక గుడిలో ఒక బాలుడు ఆడుకుంటూ గుడి గంట మోగించాడట. అలా చేసినందుకు అతని తల్లిదండ్రులు వాడిని తిట్టారు. దాంతో ఆ రాత్రి బాలుడికి విపరీతమైన జ్వరం వచ్చిందట. ఆ జ్వరంలో బాలుడు రాత్రంతా మురుగన్ పేరు చెప్పుకుంటూనే ఉన్నాడట. దాంతో ఆ మరుసటి రోజు అతని తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పూజారి బాలుడి తల్లిదండ్రులను దేవుడికి ఏదైనా సమర్పించమని అడుగగా, తల్లిదండ్రులు భక్తిశ్రద్ధలతో దేవుడికి పూలు, పండ్లు సమర్పిస్తే, బాలుడు గర్భగుడిలోని దేవుడికి మంచ్ చాక్లెట్ సమర్పించాడు. వెంటనే బాలుడు అద్భుతంగా కోలుకున్నాడు. ఆ తర్వాత మంచ్ చాక్లెట్‌ను నైవేద్యంగా సమర్పించి ఆలయంలో ప్రసాదంగా పంచే సంప్రదాయం కొనసాగుతూ వచ్చిందని చెబుతున్నారు.