ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఆరోగ్య ఆత్యయిక స్థితి ప్రకటించింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగా వ్యాధి లక్షణాలు, అనుమానిత కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎంపాక్స్ అనుమానిత లేదా నిర్ధరణ కేసుల కోసం ఢిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఈఏడాది ఎంపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 15,600 కేసులు, 537 మంది మృతి చెందారు. మన దేశంలో మార్చి తర్వాత కొత్తగా ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని.. మన దగ్గర వ్యాప్తి తీవ్రత తక్కువే అయినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
మంకీపాక్స్పై మార్గదర్శకాలు..
– అత్యవసర విభాగాల్లో ఎంపాక్స్ కేసుల పరీక్షల కోసం ప్రత్యేక స్ర్కీనింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
– జ్వరం, దద్దుర్లు, ఎంపాక్స్ నిర్ధరిత బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి
– జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలతో వ్యాధి నిర్ధరణ చేయాలి.
– అనుమానిత కేసులను తక్షణమే ఐసోలేషన్లో ఉంచాలి. తద్వారా ఇతరులకు సోకకుండా నివారించవచ్చు.
– ఎంపాక్స్ అనుమానిత వ్యక్తులను వ్యాధి నిర్ధరణ, చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రికి తరలించాలి.
– రోగులను తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు
– ఎంపాక్స్ అనుమానిత కేసుల విషయంలో ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించాలి.
0