కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్.. రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసిందని చెప్పారు.
కేటీఆర్ ట్విట్టర్ (X)లో.. “తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది.
రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి.