manatelanganatv.com

కేపీహెచ్‌బీ కాలనీలో డబుల్‌ బెడ్రూం మోసం

గవర్నమెంట్‌ ఆఫీస్‌లో తనకు పెద్ద సార్లతో పరిచయం ఉంది. మీరు రూ.2 లక్షలు ఇస్తే డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తారు.. అంటూ మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి 16 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితులకు నకిలీ అలాట్‌మెంట్‌ లెటర్లు, తాళం చెవులను సైతం ఇచ్చి.. వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన టి.రామలక్ష్మికి అల్వాల్‌లో నివసించే ఓ వ్యక్తి ద్వారా వేణుగోపాల్‌ దాస్‌, స్నేహా రామ్మూర్తి దంపతులు పరిచయమయ్యారు. వేణుగోపాల్‌ దాస్‌.. తాను గవర్నమెంట్‌ ఆఫీసుల్లో పనులు చేయిస్తుంటానని, మున్సిపల్‌ ఆఫీసుల్లో పెద్ద సార్లు తనకు తెలుసునని నమ్మించాడు.

తనకు రూ. రెండు లక్షలు ఇస్తే డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని రామలక్ష్మికి మాయమాటలు చెప్పాడు. వేణుగోపాల్‌ దాస్‌ కుటుంబ సభ్యులు మాటలను నమ్మిన రామలక్ష్మి.. కేపీహెచ్‌బీ కాలనీలో తనకు పరిచయమున్న మరో 13 మందికి ఈ విషయం చెప్పింది. తాను మూడు ఫ్లాట్లను కొనుగోలు చేస్తూ.. మరో 13 మంది 13 ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు వేణుగోపాల్‌ దాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నమ్మకం కలిగించేందుకు 13 మందిని గండి మైసమ్మ సమీపంలోని డబుల్‌ బెడ్రూం ఇండ్ల వద్దకు తీసుకెళ్లాడు. మొత్తం 16 డబుల్‌ బెడ్రూం ఇండ్ల కేటాయింపు కోసం ఒక్కొక్కరి వద్ద రూ.1,70,000 నగదు తీసుకున్నాడు. వారిలో కొందరు రూ.2.50 లక్షల వరకు చెల్లించారు. వారంతా వేణుగోపాల్‌దాస్‌కు, అతడి భార్య స్నేహా రామ్మూర్తి, బావమరిది రాహుల్‌ రామ్మూర్తికి గూగుల్‌ పే, ఫోన్‌ పే, నగదు, బ్యాంకు చెక్కుల ద్వారా డబ్బును చెల్లించారు.

అతడు గండి మైసమ్మలో చూపించిన డబుల్‌ బెడ్రూమ్‌లకు సంబంధించిన ఇంటి నంబర్లతో నకిలీ అలాట్‌మెంట్‌ సర్టిఫికెట్లు, తాళం చెవులను డబ్బులు చెల్లించిన వారికి అప్పగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాధితులంతా డబుల్‌ బెడ్రూం ఇండ్లకు వెళ్లి చూడగా.. ఆ ఇండ్లలో అసలైన లబ్ధిదారులు కనిపించారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. అతడి ఆచూకీ కోసం అల్వాల్‌ వెంకటాపురంలో ఉన్న నివాసానికి వెళ్లారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లపై ప్రశ్నించడంతో వారిపైనే కేసు పెట్టాడు. మరికొద్ది రోజులకు వెళ్లి చూడగా.. అతడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. భార్య, బావమరిది కూడా అందుబాటులోకి రాలేదు. ఫోన్లు స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులంతా కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278