సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. కొత్తగా ‘డిజిటల్ అరెస్టు’ల పేరుతో జనాన్ని బెదిరిస్తున్నారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, పోలీస్ అధికారులమంటూ అమాయకులను మోసగించి అందినకాడికి డబ్బులు దోచుకుంటున్నారు. దేశంలో ఇలాంటి నేరాలు నానాటికీ పెరుగుతుండటంపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా కుంభకోణాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నిర్దేశిత హెల్ప్‌లైన్ల ద్వారా తెలియజేయాలని ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సూచించారు.
మోసగాళ్లు తొలుత ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ స్కైప్, జూమ్ ద్వారా అమాయకులకు వీడియో కాల్స్ చేస్తారు. మీరు తీవ్రమైన నేరాల్లో భాగమయ్యారని.. పన్ను ఎగవేతలు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు మీపై కేసులు నమోదయ్యాయని భయపెడతారు. మనీ లాండరింగ్, స్మగ్లింగ్, డ్రగ్స్ కేసుల్లో మీ పేరు ఉన్నదని, కోర్టు ఆదేశాలతో మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరిస్తారు. ఆపై ఎటూ కదలనివ్వకుండా విచారణ జరుపుతున్నట్టు నటిస్తారు.
ఎదుటివాళ్లు నమ్మేలా యూనిఫాంలో కనిపిస్తారు. వారి వెనుక పోలీస్ లేదా సంబంధిత శాఖల లోగోలు కనిపించేలా చూసుకుంటారు. విచారణ చాలా గోప్యంగా జరగాలని, దీని గురించి ఎవరికైనా చెప్తే శిక్ష మరింత పెరుగుతుందని హెచ్చరిస్తారు. ఆ విచారణలో భాగంగా మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలను తీసుకుని డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. లేదా ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్తారు. అలా అందినకాడికి దోచుకుంటారు.
- మీకు కాల్ చేసింది ఎవరో గమనించాలి: డబ్బు చెల్లించాలని లేదా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అందజేయాలని నిజమైన ప్రభుత్వ అధికారులెవరూ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగరన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
- ప్రశాంతంగా ఆలోచించాలి: మీకు ఏదైనా బెదిరింపు కాల్ గానీ, మెసేజ్ గానీ వస్తే ఓ క్షణం ఆలోచించాలి. మోసగాళ్లు ఏది చెప్తే అది వెంటనే చేసేయకూడదు. కేటుగాళ్లు ఎంత త్వరపెట్టినా ప్రశాంతంగానే ఉండాలి.
- వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలి: నో యువర్ కస్టమర్ (కేవైసీ) డాటా, బ్యాంకు ఖాతా, వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వివరాలు సహా సున్నితమైన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదు.
- అప్రమత్తంగా వ్యవహరించాలి: గ్రమెటికల్ తప్పులతో కూడిన సందేశాలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు.
- అనుమానాస్పద కార్యకలాపాలపై ఫిర్యాదు చేయాలి: అనుమానాస్పద సందేశాలు, లింకులు ఏమైనా వస్తే టెలికం విభాగం ఆధ్వర్యంలోని చక్షు పోర్టల్ లేదా 1930 లాంటి హెల్ప్‌లైన్ల ద్వారా ఫిర్యాదు చేయాలి.