బావుల వద్ద మీటర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు.మొన్న ఇదే సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 30 వేల కోట్ల నష్టానికి సిద్ధపడ్డాం కానీ.. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టలేదు అని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావు మాట్లాడింది తప్పని చెప్పారు. కేసీఆర్, మోదీ సంతకాలు పెట్టారని కొలంబస్, వాస్కోడిగామా లాగా రేవంత్ రెడ్డి ఒక పత్రం పట్టుకొచ్చారు. కొన్ని పదాలు డిలీట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి చదివారు అని గుర్తు చేశారు.
హరీశ్‌రావు కేవలం ఉదయ్ పథకం గురించి చెప్పారు. ఈ పథకంలో 27 రాష్ట్రాలు చేరాయి. ఈ పథకం డిస్కలం ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకొచ్చారు. ఉదయ్ పథకంలో మా కంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేరాయి. ఆ తర్వాత మేం కూడా చేరాం.. సీఎం ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
2014కు ముందు 24 గంటల విద్యుత్ ఇస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం అంధకారం అయిందని రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒక్క ట్రాన్స్‌ఫార్మర్, పోల్స్ పెట్టలేదని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇండ్ల మీద నుంచి విద్యుత్ లైన్లు వెళ్లలేదు. 2014కు ముంద కరెంట్ లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు. చాలా వరకు అలాంటి కనెక్షన్లను తొలగించాం. తెలంగాణ ఏర్పాటు నాటికి 7 వేల మెగావాట్లు.. 2024 నాటికి 19483 మెగావాట్లు.. అంటే పదేండ్లలో 11 వేలు పెరిగింది. సోలార్ కెపాసిటీ.. 60 ఏండ్లలో 74 మెగావాట్లు. మేం వచ్చిన తర్వాత 6132 మెగవాట్లు ఇచ్చాం. 2014కు ముందు విద్యుత్ పీక్ డిమాండ్ 5661 మెగవాట్లు.. మేం అధికారంలోకి వచ్చాక పీక్ డిమాండ్ 15497 మెగావాట్లు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.