హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది? సాధారణ రైళ్లలో వెళ్తే 12 గంటలు.. అదే వందేభారత్ రైలులో అయితే 8.30 గంటల్లోనే వెళ్లొచ్చు. కానీ అదే నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లగలిగితే ఎలా ఉంటుంది.. అతి త్వరలోనే ఆ కోరిక తీరబోతుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళిక కీలక దశకు చేరుకుంది. ఈ మేరకు శంషాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది.
సికింద్రాబాద్ నుంచి వైజాగ్‌కు ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు వెళ్తున్నాయి. మొదటిది వరంగల్-ఖమ్మం-విజయవాడ మార్గం. రెండోది నల్గొండ-గుంటూరు-విజయవాడ. ఈ రెండు మార్గాల్లో గంటకు 110 నుంచి 130 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. కానీ గంటకు 220కి.మీ. వేగంతో రైల్లు ప్రయాణించేలా ఇప్పుడు కొత్త మార్గాలను రైల్వే శాఖ ప్రతిపాదించింది. ఇందులో ఒకటి హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిని అనుకుని ఉన్నట్లుగానే ఉంటుంది. దీన్ని సూర్యాపేట, విజయవాడ మీదుగా మొదటి మార్గాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా వైజాగ్ నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇది వైజాగ్ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజనీరింగ్, ట్రాపిక్ (పెట్) సర్వే తుది దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మార్గంలో శంషాబాద్, రాజమండ్రి విమానాశ్రయాలకు అనుసంధానించేలా ఈ ప్రణాళికను రూపొందించడం విశేషం. విమాన ప్రయాణికులు అతి తొందరగా స్వస్థలాలకు వెళ్లేలా ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల ప్రణాళికను రూపొందించింది.