తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడంలేదని విమర్శించారు.
గతంలో విద్యా వ్యవస్థ పటిష్టం కోసం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని వివరించారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పాటుపడ్డారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ సర్కారు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వసతులు అంతంత మాత్రమేనని, తగినంత మంది టీచర్లు లేరని, పుస్తకాల కొరత, తాగునీటి కొరత ఉన్నాయని హరీశ్ రావు వెల్లడించారు. జీతాల చెల్లింపు ఆలస్యమవుతోంది ఆరోపించారు. విద్యాశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్ రావు తన లేఖలో విమర్శించారు.
మీరు అధికారంలోకి వచ్చి ఏడు నెలలయింది… కొత్తగా మీరు చేసిందేమీ లేకపోయినా, గత ప్రభుత్వం చేసిన వాటిని కొనసాగిస్తే బాగుండేది అని హితవు పలికారు. కాంగ్రెస్ సర్కారు పాలన తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రభుత్వ పాఠశాలలకు శాపంలా మారిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం హెల్పర్లకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు.