బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా?, కెసిఆర్ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలన్నారు. శాసన సభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్ అవాస్తవాలతో కూడి ఉందని చురకలంటించారు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని, బడ్జెట్‌లో బిఆర్‌ఎస్‌ను విమర్శించడం తప్పా మరేం లేదన్నారు. రూ.4.5 లక్షల లేని జిఎస్‌డిపిని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని హరీష్ అడిగారు.
రామగుండం నుంచి 1400 మెగావాట్ల విద్యుత్ వస్తోందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో రూ.200 పింఛన్‌ను రూ. రెండు వేలకు పెంచామని, రూ.4వేల పింఛన్ నాలుక మీదనే ఉందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. తెలంగాణలో దశాదిశలేని పరిపాలన నడుస్తోందని, ఎవరి పరిపాలనలో తలసరి ఆదాయం పెరిగిందో తెలుసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని, బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఎలా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కరెంట్ ఉందా? లేదా? అని ప్రజలన్నీ అడుగుదామని హరీష్ సవాల్ విసిరారు. బిఆర్ఎస్ హయాంలో టాప్ 20లో తెలంగాణకు 19 అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.