తెలంగాణ ఉద్యమం ఆధునిక ప్రపంచంలోనే ఒక జాతి సలిపిన మహోన్నత పోరాటం. ప్రజాస్వామ్యబద్ధంగా సాధించిన అద్భుత విజయం. అరవై ఏండ్లుగా తెలంగాణ వనరులను, జలాలు, నిధులను దోపిడీ చేసిన వలస పెట్టుబడిదారీ వ్యవస్థను, వలస పెత్తందారీతనం మెడలు వంచి సాధించిన అద్భుత విజయం. ఎన్నో వేదికలు, మరెన్నో పోరాట రూపాలను, ఇంకెన్నో ఉద్యమ పాఠాలను నేర్పిన సందర్భం. ఇదీ తెలంగాణ ఉద్యమ చరిత్ర. సాధించిన ఘనత. ఎక్కడైనా సరే చరిత్ర నిర్మాతలను తలుస్తారు. పోరాట యోధులను కొలుస్తారు. పోరాట ఘట్టాలను మననం చేసుకుంటారు. ముందుతరాలకు ఆ పోరాట గాథలను పాఠాలుగా చెప్తారు. కానీ, పోరాటాన్ని నిర్వీర్యం చేసే శక్తులను లేశమాత్రమైన స్మరించరు. వారి పేర్లను ఉచ్ఛరించడాన్ని సహించరు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందుకు భిన్నమైన దుస్థితి. ఉద్యమ ద్రోహులదే చరిత్రగా చలామణి అవుతున్నది. చరిత్రగా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతున్నది. అందుకు తాజాగా గ్రూప్-2 పరీక్షలో ఉద్యమ చరిత్ర పేపర్‌లో అడిగిన ప్రశ్నలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉద్యమ చరిత్రను తక్కువ చేస్తూ, నాటి ఉద్యమ ద్రోహులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడమే అందుకు బలాన్ని చేకూర్చుతున్నది. ఉద్యమ చరిత్రను చెరిపే కుట్రలకు అద్దం పడుతున్నది. సోమవారం నిర్వహించిన గ్రూప్ -2 తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్‌లో ఏకంగా 13కు పైగా ప్రశ్నల్లో ఆంధ్రా ప్రాంతం, చంద్రబాబుకు సంబంధించినవే ఉండటం గమనార్హం.
ద్రోహుల చరిత్రకు పెద్దపీట
అనవాళ్లు చెరిపేస్తా, నిశాన లేకుండా చేస్తానన్న రేవంత్‌రెడ్డి సర్కారు అన్నంతపనీ చేసిం ది. తెలంగాణ అసలు చరిత్రను చెరిపేసేందుకు పూనుకుంది. ద్రోహుల చర్రితను క్రమంగా తెలంగాణలో వ్యాప్తి చేయనున్నది. అదే అస లు చరిత్ర అని ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. చంద్రబాబు, రాయపాటి, కావూరి, లగడపాటి పచ్చి తెలంగాణ వ్యతిరేకులు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను ఒంటబట్టించుకుని రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వారు. వీరిని తలచుకోవడం, వీరి కంపెనీల గు రించి గుర్తుచేసుకోవడం దౌర్భాగ్యమని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతాలకు చెందిన కంపెనీలు, అది దివాలా తీసిన, బ్యాంకులను మోసం చేసిన కంపెనీలకు సంబంధించిన ప్రశ్నలిచ్చారు. తె లుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అనడం వెనుక ఇదే కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఏపీ చరిత్రను తొలగించి పూర్తిగా తెలంగాణీకరించారు. ఇది టీజీపీఎస్సీ కాదు, టీడీపీఎస్సీ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు మీదున్న స్వామిభక్తిని రేవంత్‌రెడ్డి ఇలా చాటుకున్నాడంటూ సోషల్ మీడియాలో పలువురు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి.
అంతా బాబు భజనే
గ్రూప్ -2 పేపర్ చూస్తే తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రశ్నపత్రమా? లేక, టీడీపీ సన్మాన పత్రమా? అన్న అనుమానం రాకమానదు. గ్రూప్-2 క్వశ్చన్ పేపర్‌లో రేవంత్‌రెడ్డి పూర్తిగా చంద్రబాబు భజన చేయించాడు! రెండు కళ్ల సిద్ధాంతి చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలను ప్రశ్నాపత్రం నిండా అచ్చొత్తించాడు! క్వశ్చన్ పేపర్ అంతా బాబు భజనను దగ్గరుండి చేయించినట్టున్నాడు! తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన విషయం అత్యంత ప్రధానమైన ప్రశ్న అట! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సంగతి ప్రశ్నాపత్రంలో ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజన్-2020 డాక్యుమెంట్ తయారు చేసిన సంస్థ ఏదైతే మనకేంటి? ఆ విషయం ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులను ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజాంసాగర్, కడెం ప్రాజెక్టులను ఎవరు నిర్మించారని ఈ టైంలో అడిగించడం వెనక కుట్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ, తెలుగు గౌరవం లాంటి పదాలను బలవంతంగా ప్రశ్నాపత్రంలో చొప్పించడం వెనక ఉన్న ఎజెండా ఏంటి? కావూరి సాంబశివరావు, లగడపాటి, సుబ్బరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు పేర్లు తెలంగాణ గ్రూప్-2 ప్రశ్నపత్రంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి? ఆంధ్రా రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లను గుర్తించి జతపరచాల్సిన ఖర్మ మనకెందుకు? అసలేం జరుగుతోంది? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.