తెలంగాణలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు రాబోతున్నాయా? అసెంబ్లీ పరిణామాలు పరిశీలిస్తే ఇదే సందేహం వ్యక్తమవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య విస్తృత చర్చకు దారితీసిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగిస్తారనే సమాచారంలో నిజమెంత? ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రమాదంలోకి నెట్టేసే సంచలన నిర్ణయానికి ప్రభుత్వం సాహసం చేయగలదా? గత సర్కార్ వల్లే మోటార్లకు మీటర్లు పెట్టాల్సిరావొచ్చే ప్రచారం వెనుక వ్యూహం ఏంటి?
రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెడతారనే ప్రచారంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదయ్ పథకంలో భాగంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న నిబంధన పెట్టింది. ఇలా మీటర్లు పెట్టే రాష్ట్రాలకు సున్నా పాయింట్ ఐదుశాతం అదనంగా రుణాలిస్తామని కేంద్రం అప్పట్లోనే ప్రకటించింది. ఐతే అదనపు రుణాలను ఆశించిన రాష్ట్రాలు అప్పట్లోనే ఈ నిబంధనకు అంగీకరించినా, తెలంగాణలో మాత్రం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఇంతవరకు స్మార్ట్ మీటర్లు బిగించలేదు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు… గత సర్కార్ హయాంలోనే కేంద్రంతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందనే ప్రభుత్వ వాదన పరిశీలిస్తే త్వరలోనే రాష్ట్రంలోనూ వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడమనే అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం. ఐతే తెలంగాణలో మాత్రం వ్యవసాయేతర కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు రెడీ అయింది. దీనిపై కేంద్రంతో ఒప్పందం చేసుకున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ, అధికారపక్షం వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైందని ఆరోపిస్తూ సభలో సంబంధిత పత్రాలు చూపుతోంది ప్రభుత్వం… దీంతో ఏది నిజమో తెలియకపోయినా… మోటార్లకు మీటర్లు వస్తాయా? అనే భయం మాత్రం రైతుల్లో కనిపిస్తోందంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ డిస్కంలు మీటర్ల ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అప్పటి అగ్రిమెంట్‌ను అసెంబ్లీలో చదివి వినిపించడంతోనే సందేహాలు మొదలయ్యాయి. 2017 జూన్ 30లోపు అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్లు, 2018 డిసెంబర్ 31లోపు 500 యూనిట్లకు పైగా విద్యుత్తును వినియోగించే వినియోగదారుల ఫీడర్ల వద్ద,
2019 డిసెంబర్ 31లోపు 200 యూనిట్లకుపైగా వినియోగించుకునే వారి ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఇ ఒప్పందంలో ఉందని చెబుతున్నారు సీఎం.గృహ, వ్యవసాయ వినియోగ విద్యుత్తుకు నూటికి నూరు శాతం మీటర్లు బిగిస్తామని సుస్పష్టంగా ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని దాచిపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
మోటార్లకు మీటర్లు బిగిస్తే 30 వేల కోట్లు..
ఐతే ప్రభుత్వ ఆరోపణలు కొట్టిపడేస్తున్న బీఆర్‌ఎస్…. మోటార్లకు మీటర్లు బిగిస్తే 30 వేల కోట్లు అదనంగా రుణమిస్తామని చెప్పినా, తాము వదులుకున్నామని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం బీఆర్‌ఎస్ వాదనను తోసిపుచ్చుతోంది. బీఆర్‌ఎస్ చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి గుదిబండలా మారిందని ఆరోపిస్తున్నారు.