ప్రభుత్వ రంగ టెల్కో బీఎస్ఎన్ఎల్కు ఆదరణ భారీగా పెరుగుతోంది. ప్రయివేటు టెల్కోలు అడ్డగోలుగా పెంచిన టారీఫ్‌లను వినియోగదారులు భరించలేక.. బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త ఖాతాదారులు లక్షల్లో వచ్చి చేరుతున్నారు. కేవలం రెండు నెలల్లోనే బీఎస్ఎన్ఎల్లో కొత్తగా 55 లక్షల మంది పైగా చేరారు. ఇదే సమయంలో ప్రయివేటు టెల్కోలు ఏకంగా 1.21 కోట్ల ఖాతాదారులను పొగొట్టుకున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రారు శుక్రవారం వెల్లడించిన గణంకాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో బీఎస్ఎన్లో కొత్తగా 25.3 లక్షల మంది వినియోగదారులు చేరారు. ఇంతక్రితం నెల జులైలోనూ 29.3 లక్షల మంది కొత్తగా వచ్చారు.
టారీఫ్‌ల దెబ్బకు.. రిటర్న్ గిఫ్ట్
రిలయన్స్ జియో జులైలో తొలుత భారీగా టారీఫ్‌లను పెంచడం.. ఆ బాటలోనే భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 25 శాతం వరకు టారీఫ్‌లను పెంచేశాయి. దీంతో ఆ భారాన్ని భరించలేక అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. గడిచిన ఆగస్ట్ నెలలో జియో, ఎయిర్టెల్, విఐలు ఏకంగా 83 లక్షల మంది ఖాతాదారులను పొగొట్టుకున్నాయి. ఒక్క నెలలోనే రిలయన్స్ జియోను ఏకంగా 40.2 లక్షల మంది వదులుకున్నారు. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు 24.1 లక్షల మంది గుడ్‌బై చెప్పగా.. విఐ 18.7 లక్షల మందిని కోల్పోయింది. ఇంతక్రితం జులైలోనూ ఈ మూడు టెల్కోలకు 38.6 లక్షల మంది ఖాతాదారులు గుడ్‌బై చెప్పారు.
ప్లాన్ల ధరలు పెంచం : బీఎస్ఎన్ఎల్
ప్రయివేటు టెల్కోలు ఉచిత కాల్స్ పేరుతో తొలుత స్వల్ప చార్జీలతో మార్కెట్లోకి వచ్చి.. కాలక్రమేణ అమాంతం పెంచేశాయి. కాగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇటీవల తన ఖాతాదారులకు బలమైన హామీ ఇచ్చింది. తమ సంస్థ భవిష్యత్తులో టారీఫ్‌లను పెంచే యోచనలో లేదని ఇటీవల నూతన లోగో ఆవిష్కరణ సమయంలో స్పష్టం చేసింది. దీంతో ప్రయివేటు టెల్కోల్లో మరింత గుబులు మొదలయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్ఎన్ఎల్కు ప్రయివేటు టెల్కోల ఖాతాదారుల వలస మరింత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.