తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు జులై 7వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.2 లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన వెలువరించారు. ఆసక్తి కలిగిన వారు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ.5 వేల చొప్పున ఉపకార వేతనం కూడా అందజేయనున్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లలో కోచింగ్ ఇస్తారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం 040-24071188 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. కాగా మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి.