అర్హతలున్నా తమకు రుణమాఫీ కావడం లేదంటూ ఆగ్రహంతో రైతులు బ్యాంకును ముట్టడించి నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా రెంజల్లో కెనరా బ్యాంకు పరిధిలోని రైతులు తమకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదని, ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి సానుకూల స్పందన కానరావడం లేదని బ్యాంకు ముందు ధర్నాకు దిగారు. స్థానిక కెనరా బ్యాంకులో వేలాది మంది రైతులు పంట రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడుతల్లో కలిపి రూ.లక్షన్నర లోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో తమకు రుణబాధ తప్పిందని రైతులు భావించారు. అయితే రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేకపోవడం..ఖతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు కొన్ని రోజులుగా వ్యవసాయ కార్యాలయం, బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు. అధికారుల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన వందలాది రైతులు కెనరా బ్యాంక్ ఎదుట బైఠాయించారు. తక్షణమే తమ పంట రుణాలను మాఫీ చేయాలని, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. కాగా ఆందోళనకు దిగిన అన్నదాతలను బ్యాంకు అధికారులు సముదాయించి, వారి సమస్యను ప్రభుత్వానికి నివేదించామని, తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు.
0