మీ పల్లెల్లో, మీ వీధుల్లో ఎవరెవరు తిరుగుతున్నారో గమనిస్తున్నారా? ముసుగులు వేసుకుని వస్తున్న మోసగాళ్లను గుర్తు పడుతున్నారా? గ్రామాల్లోకి దొంగలు చొరబడ్డారు. మూఢ నమ్మకాల పేరుతో, పిచ్చి పిచ్చి వేషధారణల్లో మాయ మాటలతో జనాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే మీ ఒళ్లు, ఇల్లు గుల్లవ్వడం ఖాయం. ఇలాంటి ఘటనే వికారాబాద్ లో జరిగింది.
ప్రజల నమ్మకాలు, బలహీనతలు ఆసరా చేసుకుని పబ్బం గడుపుకునే వారికి కొదవలేదు. అమాయకులే వారి టార్గెట్. పూజలు, హోమాలు, దోష నివారణల పేరుతో డబ్బులు, నగలు లూటీ చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. అయితే, ఇక్కడ బాధితుడు తేరుకుని దొంగ బాబాలకు బడితె పూజ చేశాడు. అమాయకులే టార్గెట్ గా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకునే దొంగబాబాలు జనాలకు చిక్కారు. డబ్బులు, నగలు లూటీ చేయబోయి ప్రజల చేతిలో తన్నులు తిన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ లో దొంగ బాబాలు హల్ చల్ చేశారు. నస్కల్ గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 10వ తేదీన మధ్యాహ్నం గుజరాత్ రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంలో ముగ్గురు బాబాలు, ఓ డ్రైవర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వచ్చారు. అంతా కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత మెల్లగా జారుకునే ప్రయత్నం చేశారు. అయితే, శ్రీధర్ వారిని డబ్బులు అడిగాడు. ఈ సమయంలో శ్రీధర్ చేతిని పట్టుకున్న దొంగ బాబాలు..నీకు దరిద్రం పట్టిందంటూ భయపెట్టారు. ఈ దరిత్రం పోవాలంటే శాంతిపూజలు చేయాలని నమ్మబలికారు.