manatelanganatv.com

కేజ్రీవాల్ పిటిషన్‌లపై ముగిసిన వాదనలు… తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

మద్యం పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అరెస్ట్‌ను సవాల్ చేసిన పిటిషన్‌తో పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై కోర్టులో వాదనలు ముగిశాయి. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను జులై 29కి వాయిదా వేసింది.

కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, విక్రమ్ చౌదరి, సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ వాదనలు వినిపించారు.

కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అని… ఉగ్రవాది కాదని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. కొన్ని నెలలుగా జైల్లో ఉన్నా ఆయనను సీబీఐ అరెస్ట్ చేయలేదని.. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు సైతం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిందని.. ఆ తర్వాత లొంగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని.. కోర్టు నిర్ణయం కచ్చితంగా సరైందే అన్నారు.

కేజ్రీవాల్ ఎక్కడకూ పారిపోవడం లేదన్నారు. తప్పుడు కేసులో ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. విచారణకు కేజ్రీవాల్ ఎప్పుడూ సహకరిస్తూ వచ్చారన్నారు. నిద్రపోతున్న సమయంలో కేజ్రీవాల్ షుగర్‌ లెవల్స్‌ ఐదుసార్లు పడిపోయాయని.. ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. నిద్రపోతున్న సమయంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గడం ప్రమాదకరమన్నారు. ఈ కేసులో అందరికీ బెయిల్‌ వచ్చిందని, కేజ్రీవాల్‌కు మాత్రం రాలేదన్నారు. వాస్తవాలను పరిశీలించి బెయిల్‌ను మంజూరు చేయాలని కోరారు. 

కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు చట్టం ప్రకారం అనుమతి అవసరమని సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్‌ వాదించారు. ఈ కేసులో జనవరిలో సాక్షిగా మారిన మాగుంట వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. అంతకుముందు ఏం చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థగా సీబీఐకి సొంత హక్కులు ఉన్నాయని.. ఏ నిందితుడిపై ఛార్జిషీట్‌ను ఎప్పుడు దాఖలు చేయాలి.. ఏ నిందితుడిని ఎప్పుడు పిలవాలో నిర్ణయించే హక్కు ఉందని పేర్కొన్నారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278