సామాన్యులే కాదు సినిమా వాళ్ళు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ నటిని నమ్మించి బోల్తా కొట్టించారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. కుందన్‌బాగ్‌లో నివసించే సినీనటి మహిమా గౌర్ కు ఈనెల 6న రంజన్‌షాహీ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
తాను సినీ నిర్మాతనంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని సూచనల మేరకు అనిత అనే మరో మహిళ మహిమా గౌర్ కు ఫోన్‌చేసి తాను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి హెచ్ ఆర్ డైరెక్టర్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకుంది. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో జీవితకాలం పనిచేసే కార్డును రూ.50,500కు అందిస్తున్నామని మహిమాను నమ్మించింది.
దీంతో మహిమాగౌర్ మూడు దఫాలుగా ఆమెకు డబ్బు బదిలీ చేసింది. అనంతరం తిరిగి డబ్బులు కోరడంతో మహిమా గౌర్‌కు అనుమానం వచ్చి సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయగా.. పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యి.. రూ.20,200 సైబర్ నేరస్థుల ఖాతాలోకి వెళ్లకుండా నిలిపివేశారు. కాగా మహిమా గౌర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.