కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనపై భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని, నాణ్యతాప్రమాణాలు పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు. బొగ్గు పొరలున్న విషయాన్ని గుర్తించకుండా ఆ స్థలంలో ప్రాజెక్టు నిర్మించడంతో 7వ బ్లాక్‌లో ఒక పిల్లర్ కుంగిందని ఈ ఘటనపై విచారణ జరపాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని రాజలింగమూర్తి పేర్కొన్నారు. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, అప్పటి ఇరిగేషన్ కార్యదర్శి రజత్‌కుమార్, అప్పటి సీఎంవో స్మితాసభర్వాల్, చీఫ్ ఇంజినీర్లు శ్రీధర్, హరిరాం, మెఘా సంస్థ యజమాని కృష్ణారెడ్డి, ఎల్‌అండ్‌టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్‌పై అభియోగాలు మోపి విచారణ చేపట్టాలని పిటిషినర్ కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేసీఆర్‌తోపాటు ఎనిమిది మంది సెప్టెంబర్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది.
0