ఏపీ మాజీ సీఎం జగన్ బెయిల్రద్దుకు కుట్ర జరుగుతుందని పేర్కొనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని వైఎస్ షర్మిల అన్నారు. కుటుంబంలో ఆస్తుల పంపకంలో జరుగుతున్న వివాదంపై మరోసారి ఆమె స్పందించారు. వందశాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూ పై వైఎస్ జగన్ సంతకం చేశారు. బెయిల్ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు.
2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను ఎలా అమ్మారు? విజయమ్మకు రూ. 42 కోట్లకు షేర్లు ఎలా అమ్మారు? షేర్లు అమ్మడం స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని మీకు తెలుసు కాబట్టే షేర్లను విక్రయించి, సంతకాలు చేశారని ఆరోపించారు. షేర్లు (Shares) విక్రయించి ఇప్పుడేమో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు తెలుసని అన్నారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదని, రూ. 32 కోట్లు విలువైన కంపెనీ స్థిరాస్తి అని పేర్కొన్నారు. షేర్ల బదలాంపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు తనకు లేవని వెల్లడించారు. స్టేటస్కో ఉన్నది షేర్లపై కాదని తెలిపారు.
గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటి షేర్లు, స్టాక్మార్కెట్లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదని అన్నారు. ఈడీ అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదమని షర్మిల తెలిపారు.