వలస ఎమ్మెల్యేకు పెద్దపీట వేస్తున్నారని ఆ సీనియర్ ఎమ్మెల్సీ ఫీల్ అవుతున్నారట. తన ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. తన పాలన సాగాలని కోరుకున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే ఎక్కువగా చెల్లుబాటవుతోందని కారాలు మిరియాలు నూరుతున్నారట… ఎమ్మెల్యే చేరికనే వ్యతిరేకించిన పెద్దాయాన… అధిష్టానం బుజ్జగింపులతో దిగి వచ్చినా, ఇప్పుడు నామినేటేడ్ పోస్టుల విషయంలో తన వారికి అన్యాయం జరిగితే తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయించారట… అందుకే ఎప్పుడూ ఏదో హడావిడి చేసే పెద్దాయన కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్నారంటున్నారు. ఇలా ఆయన కామ్‌గా ఉన్నారంటే ఏదో పొలిటికల్ తుఫాన్ ముంచెత్తడం ఖాయమంటున్నారు… ఇంతకీ ఎవరా సీనియర్ నేత… ఆయన అలకసీనుకు అసలు కారణమేంటి?
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. అధిష్టానం బుజ్జిగించినప్పటకీ… పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే ఆవేదనే జీవన్‌రెడ్డిలో కనిపిస్తుందంటున్నారు. తన సొంత నియోజకవర్గం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్… కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రుగానే ఉన్నారంటున్నారు. ఇక పుండు మీద కారం జల్లినట్లు ఓవైపు అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్‌రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నామినేటేడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జీవన్ రెడ్డి పంపిన జాబితాను పక్కన పెట్టారనే ప్రచారంతో ఆయన మండిపోతున్నారంటున్నారు. సీనియర్‌గా తాను కొన్ని పేర్లు సూచిస్తే… తనకు పోటీగా ఎమ్మెల్యే సంజయ్ కూడా కొత్తగా ఓ జాబితా ఇచ్చారనే ప్రచారంతో జీవన్ రెడ్డి ఫైర్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదనలకు వెంటనే ఓకే చెబుతోన్న ప్రభుత్వం..
నామినేటెడ్ పోస్టులపై ఒకే నియోజకవర్గం నుంచి రెండు లిస్టులు వెళ్లడం… తన మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదని గమనించిన జీవన్‌రెడ్డి గత 15 రోజులుగా మౌనాన్ని ఆశ్రయించారని అంటున్నారు. తన అనుచరులు, నేతలతో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. అందుకే ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరినా, ఆయనను ఇంతవరకు జీవన్ రెడ్డి కలుసుకోలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో తాను నిధులు అడిగినా ఇవ్వని ప్రభుత్వం…. ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదనలకు వెంటనే ఓకే చెప్పడాన్ని తట్టుకోలేకపోతున్నారు జీవన్‌రెడ్డి. ఈ కారణంతోనే తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయానికి వచ్చారంటున్నారు.
జీవన్‌రెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టిన ఎమ్మెల్యే..
ఇదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం చాలాకాలంగా కసరత్తు చేస్తుండగా, జీవన్‌రెడ్డి ఎప్పుడో ఓ జాబితా సమర్పించారని చెబుతున్నారు. ఐతే ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఆ లిస్టును హోల్డ్‌లో పెట్టింది ప్రభుత్వం. తర్వాత ఎమ్మెల్యే సంజయ్ నుంచి ప్రతిపాదనలు తీసుకుందని చెబుతున్నారు. ఇక పార్టీలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న ఎమ్మెల్యే… సుదీర్ఘకాలంగా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారి పేర్లలనే వ్యూహాత్మకంగా ప్రతిపాదించారు. తనతో పాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన వారి పేర్లు కాకుండా పార్టీలో తొలి నుంచి ఉన్న బలమైన నాయకులను సంజయ్ ప్రోత్సహించడంతో జీవన్‌రెడ్డి రాజకీయంగా ఇరుకునపడ్డారంటున్నారు. ఇది ఆయనను మరింత ఆగ్రహానికి గురిచేస్తోందంటున్నారు. దీంతో జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది.