తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేశారు. దీనిపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలోనే అధికార, విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైనందున తర్వాత నిర్ణయం తీసుకుందామని బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి పేర్కొన్నారు.
కానీ బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటర్ బాటిల్స్, కాగితాలు విసిరేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోను తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ భూ భారతి బిల్లుపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సభ్యులు భూ భారతి బిల్లును ఆమోదించకుండా అడ్డుకునేందు యత్నిస్తున్నారన్నారు. వీళ్ల తీరువల్ల సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది.. సభలో గుండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం లాంటివి లేకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆఎస్ చిల్లర వేషాలను ప్రజలు హర్షించరంటూ విమర్శలు చేశారు. అలాగే అంతకుముందు ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.