manatelanganatv.com

తెలంగాణను ఇకపై ఫ్యూచర్‌ స్టేట్‌ అని పిలుద్దాం: సీఎం రేవంత్‌ రెడ్డి

ఇకపై తెలంగాణను ‘ఫ్యూచర్‌ స్టేట్‌’ అని పిలుద్దామని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ పునర్‌నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్‌కు పర్యాయపదంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు.

ఇప్పటి వరకు తాము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్​.. అని పిలుద్దాం..’ అని చెప్పారు.
ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.

హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంకండి..

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటీ సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.

ఎన్నో ఏండ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్‌గా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు టైర్-2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని, ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.

అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా.. ఈ అలయెన్స్​ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివర్లో వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయెన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని అలయెన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

Leave a Comment

Follow Us

Facebook Twitter Instagram Youtube
Notice: Undefined index: threads in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278

Notice: Undefined index: bluesky in /home/u616786290/domains/manatelanganatv.com/public_html/wp-content/themes/soledad/inc/elementor/modules/penci-social-media/widgets/penci-social-media.php on line 278