మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అయితే 42 కాస్తా తిరిగేసి 24గా మార్చేందుకు ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీ కులగణన చేసి, జనాభా శాతాన్ని తేల్చి వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
కానీ ఇతర రాష్ట్రాల్లో కోర్టు తీర్పులు రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా 50 శాతం దాటకుండా రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్, బీసీ కమిషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచి నా కోర్టులు ఆ రిజర్వేషన్లను కొట్టివేశాయి.
రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని స్ప ష్టం చేశాయి. రాజ్యాంగం ప్రకారం 50 శాతం రిజర్వేషన్‌లు దాటవద్దని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చినందున బీసీలకు 24 శాతం కంటే ఎక్కువ సాధ్యం కాదని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఓటరు జాబితా ప్రకారం తేల్చాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు ప్రభు త్వం వచ్చినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయనున్నది.
ఓట రు జాబితా ఆధారంగా వేసిన లెక్కల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్‌ను ఆయా పంచాయతీ లు, మండలాలు, జిల్లాలను ప్రాతిపదిక తీసుకొని అమలు చేస్తారు. 50 శాతంలో మిగిలిన రిజర్వేషన్‌ను బీసీలకు కేటాయిస్తారు. దీని ద్వారా సగటున బీసీలకు 24 శాతం మించకపోవచ్చని సామాజిక వేత్త లు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేశారని గుర్తు చేస్తున్నారు.
గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న గ్రామ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆశవర్కర్ల ద్వారా పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితాను ప్రామాణికంగా చేసుకొని లెక్కలు తీయనున్నారు. దీంతో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉత్తి మాటే కానున్నదని బీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే పంచాయతీలు, మండలాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు పూర్తిగా మారే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.