రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలతో కలిసి చార్మినార్ వద్ద ధర్నాకు దిగారు. రాజముద్ర నుంచి చార్మినార్‌ను తొలగించడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణ అనగానే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్, చార్మినార్ అని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐకాన్‌గా చార్మినార్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందన్నారు.
కాకతీయ కళాతోరణం ఎన్టీఆర్.. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గత పదేళ్లలో చేసిన ప్రగతిని కనిపించకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ఇలాంటి పనికిమాలిన చర్యలకు దిగడం సరికాదని అన్నారు. అసలు సీఎం రేవంత్‌కు ఇలా రాజముద్రను మార్చాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు.