గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై 109 కేసులు పెట్టిందని, రెండుసార్లు జైలుకు పంపిందని, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాగోల్‌లో నిర్వహించిన బీజేపీ వర్క్ షాప్‌నకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పార్టీ కోసం పని చేసే వారిని కాంగ్రెస్, బీఆర్ఎస్ గుర్తించదన్నారు. ఆ పార్టీల తీరును కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. అందరికీ రుణమాఫీ చేయలేదని, ఈ అంశంపై అంతా చర్చ సాగుతోందన్నారు. అందుకే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు. ఒవైసీ విద్యా సంస్థల విషయంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల టార్గెట్ తామేనని… అందుకే ఆ రెండు పార్టీలు బీజేపీతో కలిసిపోయారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయన్నారు.
మద్యం పాలసీ కేసులో జైల్లో ఉన్న కవితకు బెయిల్ రావడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస చెబుతోందని, కానీ వ్యక్తులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు ఇవ్వవని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కలవడం పక్కా అని జోస్యం చెప్పారు. ఓబీసీని దేశ ప్రధానిగా చేసింది బీజేపీయే అన్నారు. బీజేపీ ఏం చేసిందో చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పని చేస్తోందన్నారు.
ఎన్నో అవమానాలను తట్టుకొని, దేశం కోసం, ధర్మం కోసం నిలిచిన పార్టీ బీజేపీ అన్నారు. భారతదేశం మరిన్ని ముక్కలు కాకుండా అడ్డుకున్న పార్టీ బీజేపీయే అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంబేద్కర్ కలలకు రూపం ఇచ్చిన పార్టీ మనదే అన్నారు. అశాంతికి, అల్లకల్లోలాలకు కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. నాడైనా, నేడైనా, ఏనాడైనా దేశం కోసం, ధర్మం కోసం పరితపించే ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు.